Friday 10 June 2016

నగరంలోనూ ట్రామ్‌లు!

నగరంలోనూ ట్రామ్‌లు...................

హైదరాబాద్ రోడ్లపై రైళ్లు పరుగెత్తనున్నాయి..! ఇదేమిటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే..కోల్‌కతా మాదిరి మన నగరంలోనూ ట్రామ్‌లు నడిపించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మేయర్ రామ్మోహన్ నేతృత్వంలోని జీహెచ్‌ఎంసీ బృందం అక్కడి బోర్డాక్స్ నగరంలో ట్రామ్స్ రవాణాపై సమగ్ర అధ్యయనం చేసింది. 

ఈ మేరకు మన నగరంలో మెట్రోరైలు మార్గం లేని ప్రధాన రోడ్లు.. ముఖ్యంగా శివారు ప్రాంతాల నుంచి నగరాన్ని కలిపే రహదారులపై ట్రామ్‌లు నడిపితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. మెట్రోతో పోల్చితే వీటి ఖర్చు కూడా తక్కువ కావడంతో సాధ్యాసాధ్యాలపై ప్రాథమికంగా ఓ రిపోర్ట్ తయారు చేశారు. త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. 

కోల్‌కతా మాదిరి ట్రామ్ ట్రైన్లు త్వరలో నగరంలోనూ నడిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ అంశం భవిష్యత్తులో నిజమైనా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. మెట్రోరైలు మార్గంలేని ప్రధాన రోడ్లు, ముఖ్యంగా శివారు ప్రాంతాలనుంచి నగరాన్ని కలిపే రహదారుల్లో వీటిని నడిపితే బావుంటుందని వారి యోచన. నగరంలో వీటి సాధ్యాసాధ్యాలపై ఓ అంచనాతో అధికారులు ప్రాథమికంగా ఓ నివేదికను తయారుచేశారు. 

రోడ్డుపై పట్టాలుండి వాటిపై నడిచే చిన్నపాటి రైళ్లను ట్రామ్‌లుగా పిలుస్తారు. వీటిపై రైళ్లతోపాటు బస్సులు, ఇతర వాహనాలు కూడా యథావిధిగా నడిచే వీలుంటుంది. అయితే అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు. ప్రస్తుతం కోల్‌కతాలో కొన్ని ఎంపికచేసిన మార్గాల్లో ఇవి నడుస్తున్నాయి. విదేశాల్లో వీటి వినియోగం విరివిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

ఇటీవల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మేయర్ రామ్మోహన్ నేతృత్వంలోని జీహెచ్‌ఎంసీ బృందం అక్కడి బోర్డాక్స్ నగరంలో ట్రామ్స్ రవాణాపై సమగ్ర అధ్యయనం చేసింది. అక్కడ ఏడాదిలో సుమారు 65వేల కిలోమీటర్లమేర ట్రామ్స్ నడుస్తున్నట్లు వారు గుర్తించారు. సదరు నగరంలో దాదాపు 80శాతంమంది ప్రజారవాణాపైనే ఆధారపడుతున్నట్లు వారు తెలుసుకున్నారు. అంతేకాదు, ఏడాదిలో సగటున ఒక్కరు మాత్రమే చనిపోతున్నట్లు గుర్తించారు. 

మెట్రోరైలుతో పోల్చుకుంటే ఖర్చు కూడా ఎంతో తక్కువని తేలింది. ఈ నేపథ్యంలో మన నగరానికి ఇవి అనుకూలంగా ఉంటాయని మేయర్ సహా అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 72కిలోమీటర్ల పొడవున మెట్రోరైలు మార్గాలు ఏర్పాటు చేస్తున్నందున అవి మినహా మిగిలిన ప్రధాన రోడ్లు, నగరానికి శివారు ప్రాంతాలతో అనుసంధానం చేసే రహదారుల్లో వీటిని ఏర్పాటుచేసే అంశాన్ని వారు పరిశీలిస్తున్నారు. 

ఎక్కువగా రోడ్డు విస్తరణ లేకుండా ఉన్న రోడ్లపైనే వీటిని ఏర్పాటుచేసే అవకాశం ఉందని, వీటివల్ల ఒకేసారి దాదాపు 300మందిని ఒకచోటినుంచి మరో చోటికి చేర్చవచ్చని, పట్టాలపై వెళ్తాయి కనుక ఇంధన వినియోగం తక్కువగా ఉంటుందని, విద్యుత్‌తో కూడా నడపవచ్చని, బస్సుతో పోల్చుకుంటే రవాణా ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని వారు భావిస్తున్నారు. 

నగరంలో వీటి వల్ల ఏ మేరకు ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది, ట్రాఫిక్ సమస్యలు ఎంతవరకు తగ్గించవచ్చు తదితర అంశాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఓ నివేదికను తయారుచేశారు. దీన్ని ఎలా చేపట్టాలి, ప్రైవేటు భాగస్వామ్యం తీసుకోవాలా? లేక ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే అవకాశం ఏ మేరకు ఉంది అనే అంశాలను పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తారు. అనంతరం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

No comments:

Post a Comment