Friday 10 June 2016

కల్పవృక్షాలు....అలంకరణ కాదు.. ఆక్సిజన్ కావాలి!!!!!!!!!

కల్పవృక్షాలు........



భారీగా ఏపుగా పెరిగే మొక్కలనే నాటుదాం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ ;చెట్టు.. ఊపిరినిచ్చే ప్రాణ వాయువు. ఆయువునిచ్చే ఔషధం! జీవితానికి నీడనిచ్చే గూడు. మనిషికి బతువుదెరువు. అన్నింటికీ మించి ప్రాణికోటి మనుగడకు ఆదెరువు. బాల్యంలో ఊగే ఊయలై.. వృద్ధాప్యంలో ఊతకర్రై జీవితమంతా మనతోనే ఉంటుంది. ఇలా మనల్ని కాపాడే చెట్టుకు కష్టమొచ్చింది. వీటిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. ప్రస్తుతం మొక్కలు నాటడం ఒక ఎత్తయితే.. ఉన్న చెట్లను కాపాడుకోవడం మరో ఎత్తు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో మొక్కల ప్రాధాన్యత, వేటిని నాటితే మంచిదన్న అంశాలతో కూడిన కథనం మీకోసం.. 

పట్టణాలు, నగరాల్లో ఒక మొక్క నాటితే అది కలకాలం ఉంటుందన్న నమ్మకం లేదు. భూవినియోగ మార్పిడియే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో నాలుగు రోజులకే నిర్మాణాలు వెలుస్తున్నాయి. పార్కులు, ఖాళీలు స్థలాలు, కొండలు, గుట్టలన్న తేడాలేకుండా అత్యంత వేగంగా భూవినియోగం మారిపోతోంది. దీంతో నగరంలో నాటుతున్న మొక్కల జీవితకాలం 5 నుంచి 8 ఏళ్ల వరకే ఉంటోంది. ప్రస్తుతం చెట్లు నాటిన ప్రాంతం రూపురేఖలు నాలుగేళ్లకే మారిపోతున్నాయి. నగరం వేగంగా విస్తరించడం.. ప్రకృతి విపత్తులతో చెట్లు ఉన్న ఫలంగా కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొక్కలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

అలంకరణ మొక్కలతో అసలుకే మోసం..
మొక్కలు నాటడం వరకు అటుంచితే.. ఏ మొక్కలు నాటాలన్నదే అసలు సమస్యగా మారింది. మన నగరంలో నాటుతున్న మొక్కల్లో పర్యావరణానికి దోహదం చేసేవి చాలా తక్కువనే చెప్పవచ్చు. పూర్తిగా అలకరణ మొక్కలను నాటుతుండడంతో అసలుకే మోసం వస్తోంది. ఈ మొక్కలతో ఉపయోగం లేకపోగా.. కాలుష్యం వెలువడుతోందన్న వాదన లేకపోలేదు. 

జీహెచ్‌ఎంసీ అధికారులు నగరంలోని రోడ్ల మధ్యలో నాటుతున్న చెట్లు కాలుష్యానికి కారణభూతమవుతున్నాయని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ట్రంపెట్ వైన్, హైడ్రోంగియా, ఎంజెల్స్ ట్రంపెట్, లావెండర్, బెలూర్ ప్లవర్, హై బిస్కస్, లాంటి మొక్కలను నాటుతోంది. ఇవి పర్యావరణానికి ఏమాత్రం దోహదం చేసేవి కాకపోగా, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. రంగు రంగుల ఆకర్షణీయమైన చెట్ల ఆకులు, పువ్వులు రాలిపోయి చెత్తగా మారుతున్నాయి. వీటిని కంపోస్ట్‌గా మార్చే వ్యవస్థ లేకపోవడంతో డంపింగ్ యార్డుల్లో కాల్చివేయడంతో వాటి నుంచి విష రసాయనాలు, పొగ గాలిలో కలిసి కాలుష్యానికి కారణమవుతున్నారని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి బదులుగా మంచి ఆక్సీజన్‌నిచ్చే మొక్కలను నాటితే మంచిదన్న అభిప్రాయాలు లేకపోలేదు.

అత్యధిక ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఇవే.. 
వేప, తులసి, రావి, మామిడి, వెదురు, మేడి, జువ్వి, మారేడు, కానుగు, సపోటా, జమ్మి, మర్రి, చెట్లు అత్యధికంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. స్థానిక వృక్షజాతి మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. ఇవి ఏపుగా పెరిగి, విస్తారమైన ఆకులను కలిగి అధిక ఆక్సీజన్ ఇస్తాయి. హరిత హారంలో భాగంగా వీటిని నాటితేనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

24 గంటలు ఆక్సిజన్ ఇచ్చే తులసి 
మొక్కల్లో ఒక్క తులసి మొక్క మాత్రమే 24 గంటల పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. మొక్కల్లో సాధారణంగా సూర్యరశ్మి ప్రభావంతోనే కిరణ జన్య సంయోగ క్రియ జరుగుతుంది. అందుకే మొక్కలు పగటి పూట అధికంగా ఆక్సిజన్‌ను, రాత్రిపూట కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి. కానీ, సూర్యరశ్మి లేకపోయినా తులసి చెట్టు 24 గంటల పాటు కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. 

అటవీశాఖదే తప్పిదం 
మొక్కలు నాటడంలో అటవీశాఖ అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ మొక్కలు నాటాలో తెలిసి కూడా అధికారులు చొరవ తీసుకోవడం లేదు. ఇటీవల హరితహారంపై సచివాలయంలో జరిగిన సమీక్షలో పర్యావరణ వేత్తలుగా మేమంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. ఈ ఏడాది చేపట్టే హరితహారంలోనైనా రంగు రంగుల పుష్పాలతో ఆకర్షణీయంగా ఉండే మొక్కలను కాకుండా ఆక్సీజన్‌నిచ్చే మొక్కలను నాటాలి. హైదరాబాద్‌లో పెరగడానికి వీలున్న స్థానిక వృక్షజాతి మొక్కలనే నాటితే బాగుంటుంది. 
- సి.ఉమా మహేశ్వర్‌రెడ్డి

ప్రోగ్రెస్ కార్డులను నిర్వహించాలి
మొక్కలను నాటడమే కాదు.. అవి మనుగడ సాగించడం కోసం ప్రత్యేకంగా ప్రొగ్రెస్ కార్డులను నిర్వహించాలి. నెలకోసారి ఎన్ని మొక్కలు మిగిలాయి? ఎన్ని మొక్కలు పోయాయో? చూసుకోవాలి. చనిపోయిన మొక్కల స్థానంలో మరో మొక్కను నాటితే బాధ్యతను పంచుకున్నవాళ్లమవుతాం. ఇలా ఏడాది వరకు మనం నాటిన మొక్కల పెరుగుదల, మనుగడను రికార్డు చేయవచ్చు. 

-మానవుడు నిమిషానికి 300 ఎంఎల్, రోజుకు 0.84 కేజీలు, ఏడాదికి 9.5 టన్నుల ఆక్సిజన్‌ను పీల్చుకుంటాడు.
-ఒక చెట్టు రోజుకు 388 క్యూబిక్ ఫీట్లు మేర, ఏడాదికి 100 కేజీల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. 
-ఒక ఎత్తైన భారీ వృక్షం 260 పౌండ్ల ఆక్సీజన్‌ను అందిస్తుంది. 
-వంద ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వైశాల్యం గల చెట్టు 48 పౌండ్ల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని 6 వేల పౌండ్ల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
-విస్తారమైన ఒక చెట్టు విడుదల చేసే ఆక్సిజన్‌ను 9 మంది పీల్చుకునే అవకాశం ఉంది.
-ఒక ఎకరం విస్తీర్ణం గల అటవీ ప్రాంతం 19 మందికి ఏడాది పాటు కావాల్సిన ఆక్సిజన్‌ను అందిస్తుంది. 
-గ్రేటర్‌లో కోటికి పైగా జనాభా ఉండగా, ఇక్కడ ఆక్సిజన్ పీల్చుకోవడానికి 13 లక్షల చెట్లు ఉండాలి. 

No comments:

Post a Comment