Friday 30 October 2015

17వేలమందికి ఉపాధి

రాష్ట్రంలో పెద్ద పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూనే చిన్న, మధ్యతరహా వ్యాపారుల మనుగడ దెబ్బతినకుండా చూస్తామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లాంటి ప్రసిద్ధి చెందిన భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలు నెలకొన్నప్పటికీ చిన్న వ్యాపారులు చితికిపోకుండా ఎలా సమన్వయం చేయాలనే విషయంలో తమ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని స్పష్టం చేశారు. ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. దీనిద్వారా 17వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రస్తుతించారు. రంగారెడ్డి జిల్లా గుండ్ల పోచంపల్లిలో విశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఫ్లిప్‌కార్ట్ ఈ- కామర్స్ సంస్థ అతిపెద్ద ఆటోమేటిక్ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని మంత్రి ఈటల శుక్రవారం ప్రారంభించారు.

eetelarajendr


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముగ్గురు ఐఐటీ విద్యార్థుల ఆలోచనలతో 2007లో పుస్తకాల అమ్మకాలతో ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ తక్కువ కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిందని కొనియాడారు. తమ ప్రభుత్వం పరిశ్రమలకు పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నదని ఇక్కడి వాతావరణం పరిశ్రమల ఉత్పత్తులకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఆన్‌లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్‌తో సరుకులను సరఫరా చేస్తుంటే.. చిన్న, మధ్య తరహా వ్యాపారుల మనుగడ సాధ్యమా..? అని విలేకరులు ప్రశ్నించగా.. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తాము ఈ విషయంపై మాట్లాడామని , సమస్య తీవ్రత తమకు తెలుసునని మంత్రి పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా బడా సంస్థలు రావాల్సిన అవసరం ఉందని, వాటిని ప్రోత్సహించడం ద్వారా పన్నుల రూపంలో ఆదాయంతోపాటు స్థానికంగా ఉపాధి పెరుగుతుందని వివరించారు.

ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలు చిన్న వ్యాపారులను సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని మంత్రి సూచించారు. ఫ్లిప్‌కార్ట్‌లాంటి బడా ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలకు వాణిజ్యపన్నుల్లో ఎలాంటి రాయితీ లేదని మంత్రి స్పష్టం చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్లిప్‌కార్ట్ తన అతిపెద్ద కేంద్రాన్ని గుండ్లపోచంపల్లిలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. కానీ, ఇటువంటి సంస్థల వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉందని అన్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఫ్లిప్‌కార్ట్ ఆంధప్రదేశ్‌లో కూడా తన కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ బిన్నీబన్సాల్ సంస్థ కార్యకలాపాలను, లక్ష్యాలను వివరించారు. అనంతరం ఫ్లిప్‌కార్ట్ ప్రాంగణంలో మంత్రి ఈటల, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపీ రామ్మోహన్‌నాయుడు మొక్కలు నాటారు.

No comments:

Post a Comment