Friday 30 October 2015

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎస్తర్ అనూహ్య హత్య కేసులో ముంబై సెషన్స్ కోర్టు (ప్రత్యేక మహిళా న్యాయస్థానం) ఇవాళ తుది తీర్పు వెలువరించింది. అనూహ్యపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితుడు చంద్రభానుకు ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈమేరకు చంద్రభానును దోషిగా పేర్కొంటూ న్యాయమూర్తి వృషాలి జోషీ ఉరిశిక్ష విధించారు. భారతీయ శిక్షాస్మృతిలోని 302(హత్య), 376(అత్యాచారం), 397(దోపిడి, హత్య) సెక్షన్ల కింద శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు. గతేడాది 2014 జనవరి 5న హైదరాబాద్ నుంచి ముంబై పయమనమైన అనూహ్యను ముంబై చేరుకున్న తర్వాత తెల్లవారుజామున మోటారు సైకిల్‌పై తీసుకెళ్లిన నిందితుడు చంద్రభాను అనూహ్యపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అనూహ్యది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం. 

హత్య జరిగిన రోజు ఏం జరిగింది?
అనూహ్యది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఆమె ముంబైలోని అంధేరిలో ఉన్న టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 2013లో క్రిస్ట్‌మస్ సెలవుల్లో ఆమె స్వగ్రామం మచిలీపట్నంకు వచ్చారు. పండుగ సెలవుల తర్వాత 2014 జనవరి 4న రాత్రి ఆమె తిరిగి ముంబై వెళ్లిపోయారు. జనవరి 5న తెల్లవారుజాము వరకు తండ్రితో సెల్‌ఫోన్‌లో టచ్‌లో ఉన్న అనూహ్య తెల్లవారిన తర్వాత సెల్‌ఫోన్‌తో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకుండా పోయింది. సరిగ్గా పదకొండు రోజుల తర్వాత జనవరి 16న కంజూర్‌మార్గ్, బాందూవ్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో పాక్షికంగా కుల్లిపోయి, సగ భాగం కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. 

అయితే జనవరి 5న లోక్‌మాన్య తిలక్ టర్మినల్‌లో దిగిన అనూహ్యను నిందితుడు చంద్రభాను గమనించాడు. అప్పటికే దోపిడి చేయాలనే తలంపుతో అక్కడకు వచ్చిన చంద్రభాను అనూహ్యను ఎంచుకున్నాడు. ట్యాక్సి డ్రైవర్‌గా చెప్పుకుని తక్కువ ధరకే ఆమెను హాస్టల్ వద్ద దింపుతానని నమ్మబలికి స్టేషన్ బయటకు తీసుకొచ్చాడు. ఆమె వద్ద ఉన్న డబ్బును చూసి భయపెట్టి మోటారు సైకిల్‌పై ఆమెను నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రాణాలతో విడిచిపెట్టాలని, అందుకు రూ.2 లక్షలు కూడా ఇస్తానని అనూహ్య ప్రాధేయపడినా కనికరించలేదు ఆ కర్కోటకుడు. ఈ విషయాన్ని నిందితుడే స్వయంగా పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచి అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పాడు. తర్వాత ఆమె మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పటించానని తెలిపాడు. తర్వాత నాసిక్ పారిపోయానని పేర్కొన్నాడు. 

అయితే సీసీ టీవీ ఫూటేజ్ ఆధారంగా నిందితున్ని ముంబై పోలీసులు రెండు నెలల తర్వాత అరెస్టు చేయగలిగారు. తర్వాత నిందితుని వద్ద నుంచి అనూహ్యకు చెందిన హ్యాండ్‌బ్యాగ్, దుస్తులు, లాప్‌టాప్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 22 నెలలపాటు జరిగిన సుదీర్ఘ విచారణలో పోలీసులు తమకు దొరికిన ఆధారాలతో నిందితునిపై మోపిన అభియోగాలను నిరూపించగలిగారు. దీంతో కోర్టు చంద్రభానుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

No comments:

Post a Comment