Friday 30 October 2015

కోర్టు ధిక్కార నోటీసులు కేంద్ర మంత్రి సుజానాచౌదరికి...

మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా చౌదరితోపాటు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మిగతా డైరెక్టర్లు జీ శ్రీనివాసరాజు, హనుమంతరావు, జే రామకృష్ణన్, కే శ్రీనివాసరావు, వీ మాలకొండారెడ్డిలకు సైతం ధిక్కార నోటీసులను జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని న్యాయస్థానం జారీ చేసింది. సుజానా గ్రూప్‌లో సుజానా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న హెస్టియా హోల్డింగ్స్ సంస్థ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ నుంచి సుమారు రూ .100 కోట్లు అప్పుగా తీసుకొంది. అప్పు, ఇతర ఖర్చులతోపాటు రూ.106 కోట్లు చెల్లించాలని లండన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే ఈ బకాయిలను చెల్లించకపోవడంతో బ్యాంక్‌కు గ్యారెంటీ సమర్పించిన సుజానా యూనివర్సల్‌పై బ్యాంక్ అధికారులు హైదరాబాద్‌లో న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై విచారణ సమయంలో సుజానా యూనివర్సల్ సంస్థ ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను వెల్లడించాలని ఈ ఏడాది జూన్ 17వ తేదీన సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిటీ సివిల్ కోర్టు ఆదేశాలపై సుజానా గ్రూప్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే సుజానా గ్రూప్ అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఎంసీబీ బ్యాంక్ అధికారులు తాజాగా హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. పిటిషన్‌పై శుక్రవారం సుజానా యూనివర్సల్ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

No comments:

Post a Comment