Friday 30 October 2015

ప్రభుత్వానిది కాదు.. అది జాతి ఇచ్చిన గౌరవం: విద్యాబాలన్

 ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా తనకొచ్చిన జాతీయ అవార్డును తిరిగి ఇచ్చేది లేదని ప్రముఖ బాలీవుడ్ నటి, ఉత్తమ జాతీయ నటి అవార్డు గ్రహీత విద్యాబాలన్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా ఎఫ్‌టీఐఐ విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా 10 మంది ఫిల్మ్ మేకర్స్ తమకొచ్చిన జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేశారు. ఈ క్రమంలో విద్యాబాలన్ స్పందన కోరగా అవార్డును తిరిగి ఇవ్వను. ఎందుకంటే అవార్డుల రూపంలో మాకు దక్కిన ఈ గౌరవం ప్రభుత్వం వల్ల దక్కింది కాదు. అది జాతి వల్ల దక్కింది. అందుకే నేను అవార్డును వాపస్ ఇవ్వనని పేర్కొన్నారు. 

ఎఫ్‌టీఐఐ ఛైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు జూన్ 12 నుంచి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమ ఆందోళనను ఉధృతం చేస్తూ నిరవధిక నిరాహార దీక్షను సైతం చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలు రాజకీయ పక్షాల నేతలు మద్దతు ప్రకటించారు. పలు దఫాలుగా విద్యార్థులతో కేంద్రం చర్యలు జరిపినప్పటికీ విద్యార్థుల డిమాండ్లు పరిష్కారం కాలేదు. కాగా తరగతుల నిర్వహణ, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గడిచిన 139 రోజులుగా కొనసాగిన తమ ఆందోళనను విరమిస్తున్నట్లు విద్యార్థి సంఘ అధికార ప్రతినిధి రంజిత్ నాయర్ తెలిపారు. 

అయినప్పటికీ దేశ ప్రముఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ హెడ్‌గా అనర్హుడైన చౌహాన్ కొనసాగడంపై తమ ఆందోళనలు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత వాతావరణంలో కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఇకపై తమలాగే సమస్యలను ఎదుర్కొంటున్న దేశవ్యాప్త విద్యార్థులను తమ భవిష్యత్ కార్యచరణలో కలుపుకపోనున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం దిశగా తమ నిరసనలకు అకడమిక్స్, ఫిల్మ్‌మేకర్స్ తమతో కలిసి రావాల్సిందిగా ఎఫ్‌టీఐఐ విద్యార్థులు ఈ సందర్భంగా కోరుతున్నారు.

No comments:

Post a Comment