Friday 30 October 2015

మేము సైతం.....................

రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్న కంపెనీలు, ఇక్కడి అవకాశాలపై ఆసక్తి కనబరుస్తున్న సంస్థల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. రాష్ట్రంలో చేపట్టే వంతెనలు, టన్నెళ్లు, హుస్సేన్‌సాగర్ సమీపంలో నిర్మించబోయే దేశంలోనే అతి ఎత్తయిన టవర్‌సహా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, నిర్మించేందుకు చైనా దేశ కంపెనీలు సంసిద్ధత వ్యక్తంచేశాయి. మరోవైపు రాష్ట్రంలో తమ కంపెనీని విస్తరిస్తామని ప్రాక్టర్ అండ్ గాంబెల్ ప్రకటించింది. తమ దక్షిణాసియా కార్యకలాపాలను పర్యవేక్షించే ప్లానింగ్ సెంటర్‌ను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలనుకుంటున్నామని సీఎం కే చంద్రశేఖర్‌రావుకు తెలియజేసింది. 
-ముందుకు వచ్చిన చైనా కంపెనీలు
-బహుళ అంతస్తుల భవనాలు, వంతెనలు,టన్నెళ్ల నిర్మాణాల్లో పెట్టుబడులు
-హుస్సేన్‌సాగర్ ఒడ్డున అతిపెద్ద టవర్
-85% వ్యయం భరించనున్న బ్యాంక్ ఆఫ్ చైనా
-దక్షిణాసియా ప్లానింగ్ సెంటర్ ఇక్కడే
-సీఎంకు తెలిపిన ప్రాక్టర్ అండ్ గాంబెల్
-ఇప్పటికే ఉన్న కంపెనీల విస్తరణ
-వ్యవసాయం, ఆరోగ్యం, పర్యాటకం
-ఈ మూడు రంగాలపై నెదర్లాండ్స్ ఆసక్తి

వ్యవసాయం, హెల్త్‌కేర్, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై నెదర్లాండ్స్ ప్రతినిధి బృందం ఆసక్తి కనబర్చింది. శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును క్యాంపు కార్యాలయంలో చైనా కంపెనీల ప్రతినిధులు, ప్రాక్టర్ అండ్ గాంబెల్ సంస్థ ప్రతినిధులు, నెదర్లాండ్స్ పారిశ్రామికవేత్తలు వేర్వేరుగా కలిశారు. కేసీఆర్ చైనా వెళ్లిన సందర్భంగా, చైనా కంపెనీల ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై చర్చలు, పరస్పర అవగాహన ఒప్పందాలు జరుగడం తెలిసిందే.

kcr1


ప్రతిపాదిత ప్రాజెక్టుల స్థలాల పరిశీలన


రాష్ట్రంలో నీటిపారుదలశాఖ చేపట్టే ప్రాజెక్టుల ప్రతిపాదిత స్థలాలను, టన్నెళ్లు తవ్వాల్సిన ప్రాంతాలను చైనా ప్రతినిధిబృందం సందర్శించింది. మూసీనదిపై వంతెన నిర్మించ తలపెట్టిన ప్రాంతాన్ని, హుస్సేన్‌సాగర్ ఒడ్డున నిర్మించే అతిపెద్ద టవర్ ప్రతిపాదిత స్థలాన్నికూడా పరిశీలించారు. నిర్మాణాలకు సంబంధించి తాము రూపొందించిన ప్రతిపాదనలను, నమూనాలను సీఎంకు చూపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే టన్నెళ్లను తక్కువ సమయంలో, అత్యంత నాణ్యతతో పూర్తిచేస్తామని చైనా ప్రతినిధులు సీఎంకు తెలిపారు. నగరంలో మూసీపై నిర్మించే బ్రిడ్జిపైనా చర్చలు జరిగాయి.

హుస్సేన్‌సాగర్ ఒడ్డున అతిపెద్ద టవర్


హైదరాబాద్ నగరంలో దుర్గంచెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించేందుకు సీసీసీసీ హైవే కన్సల్టెన్సీ కంపెనీ ముందుకు వచ్చింది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున దేశంలోనే అతిపెద్ద టవర్ నిర్మించేందుకు అయ్యే వ్యయంలో 85% భరించడానికి బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధత వ్యక్తంచేసింది. త్వరలోనే మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎంకు తెలిపారు. చైనా బృందంలో బ్యాంక్ ఆఫ్ చైనా ఇండియా హెడ్ చివ్ హెంగ్‌చాంగ్, అంజు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ యోగేశ్ వా, ఇండియా హెడ్ మనోజ్ గాంధీ, సీసీసీసీ మేనేజర్ పెంగ్‌యన్‌గాంగ్, బిజినెస్ మేనేజర్ చాంగ్‌చున్‌యుమాన్, బీజింగ్ జిటెక్స్ బిజినెస్ మేనేజర్ వుహావ్, రాడిక్ కన్సల్టెన్సీకి చెందిన జహీర్ అహ్మద్, రాజ్‌కుమార్‌లు ఉన్నారు. 

kcr2


పీఅండ్‌జీ సౌత్ ఏషియా సెంటర్ తెలంగాణలో


తమ సంస్థ సౌత్ ఏషియా ప్లానింగ్ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రాక్టర్ అండ్ గాంబెల్ ఇండియా ఎండీ రిజ్వాని సీఎం కేసీఆర్‌కు చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తిచేశారు. శుక్రవారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో రిజ్వానితోపాటు వచ్చిన కంపెనీ ప్రతినిధి బృందం కేసీఆర్‌ను కలిసింది. ప్లానింగ్ సెంటర్, తమ వ్యాపార సంస్థల వివరాలను సీఎంకు రిజ్వాని తెలియజేశారు. ప్లానింగ్ సెంటర్‌ద్వారా దక్షిణాసియాలో కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. మొదట ఈ సెంటర్‌లో 50మంది అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమిస్తామన్నారు. తరువాత ఈ సంఖ్యను 100కు పెంచుతామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలంలోని పెంజర్ల గ్రామంలో 171 ఎకరాల్లో తమ పరిశ్రమ ఉన్నదని, ఇందులో ప్రస్తుతం 786మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని, ఇందులో 80% తెలంగాణ కార్మికులేనని సీఎంకు వివరించారు. 

తమ యూనిట్‌ను విస్తరించాలని నిర్ణయించామని, దీనికి సహకరించాలని సీఎంను కోరారు. విస్తరణవల్ల కార్మికుల సంఖ్య 1200కు పెరుగుతుందన్నారు. తమ సంస్థకు చెందిన కంపెనీలు 80 దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నాయని, వీటికి 150 దేశాల్లో మార్కెట్ ఉందని వివరించారు. పెంజర్లలోని ఉన్న తమ యూనిట్‌లో ఫ్యాబ్రిక్, హోమ్‌కేర్, బ్యూటీ కేర్, ఓరల్ కేర్, బేబీ కేర్, మహిళలు ఉపయోగించే ఉత్పత్తులు తయారవుతాయని తెలిపారు.

సామాజిక బాధ్యత తీసుకుంటాం: రిజ్వాని


రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడంతోపాటు సామాజిక బాధ్యతకూడా తీసుకుంటామని రిజ్వాని సీఎంకు తెలిపారు. సామాజిక బాధ్యతకింద ఏం చేయాలని అడిగారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్.. స్థానిక ప్రజలు ఏది కోరితే అది చేయాలని చెప్తూ.. కేజీ టూ పీజీ ఉచిత విద్య కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందని రిజ్వానికి సూచించారు. 

సీఎంను కలిసిన నెదర్లాండ్స్ బృందం


రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యపరిరక్షణ, పర్యాటకరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని నెదర్లాండ్స్ రాయబారి అల్ఫోన్సస్ స్టొలింగా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అల్ఫోన్సస్ నేతృత్వంలో నెదర్లాండ్స్‌కు చెందిన సుమారు 15 కంపెనీల ప్రతినిధుల బృందం సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా ఇరువురికి లాభదాయకంగా ఉండే వ్యాపార అవకాశాలపై చర్చించారు. అగ్రికల్చర్, గ్రీన్‌హౌస్ కల్టివేషన్, అగ్రికల్చర్ వర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ తదితర అంశాలు ప్రధానంగా చర్చకువచ్చాయి. తనతోపాటు వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులు సుమారు 20 మందిని ముఖ్యమంత్రికి పేరుపేరున అల్ఫోన్సస్ పరిచయం చేశారు. బృందంలోని ఒక్కొక్కరు ఒక్కోరంగంలో నిష్ణాతులని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులతో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమావేశం గురించి స్టొలింగా ముఖ్యమంత్రికి వివరించారు. 

ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా ఎకనామిక్స్, అగ్రికల్చర్, రీసెర్చ్ తదితర ప్రత్యేక అంశాలపై చర్చించారు. ఫిలిప్స్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి సీఎంతో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు నుంచి వచ్చిన సూచనమేరకు తాము ప్రభుత్వ దవాఖానల్లో హెల్త్‌కేర్ సేవలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ మూడు సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎస్ బృందంతో డచ్ బృందం..


అంతకు ముందు బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నెదర్లాండ్స్ బృందం రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందంతో సమావేశమైంది. ప్రభుత్వంనుంచి పాల్గొన్న బృందంలో మున్సిపల్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పరిశ్రమలు, వ్యవసాయం, గృహనిర్మాణశాఖల కార్యదర్శులు, మెట్రోరైల్ ఎండీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో టూరిజం, పరిశ్రమలు, మెట్రో తదితర అంశాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు, విస్తృతం చేయడానికున్న అవకాశాలపై ఉన్నతాధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. డచ్ కంపెనీల ప్రతినిధులు తమ ప్రత్యేకతలు, సామ ర్థ్యం గురించి ప్రెజెంటేషన్లు ఇచ్చారు. పర్యాటకరంగంలో అడ్వెంచర్, హెరిటేజ్, కేవ్ ఎక్స్‌ప్లొరేషన్ తదితర అంశాలపై రాష్ట్ర టూరి జంశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రెజంటేషన్ ఇచ్చారు. 

పరిశ్రమలకు అవకాశాలు, ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం, పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నాయనేదానిని వివరించారు. మెట్రో రైల్వే వ్యవస్థ.. అందులో ఉన్న అవకాశాలపై మెట్రో ఎండీ వివరంగా తెలిపారు. నెదర్లాండ్స్ బృందంలో హెడ్ ఆఫ్‌ది ఎకనామిక్స్ మైఖెల్ బైర్కెన్స్, సీనియర్ పాలసీ అడ్వైజర్ మాయా ఆచార్య, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కౌన్సెలర్ ఆనంద్ క్రిష్ణన్, నెగ్జస్ నోవస్ ప్రతినిధి రుట్జర్ డి బ్రూయిజ్న్, కాబా ఇన్‌ఫ్రాటెక్ ప్రతినిధి అనురాగ్ చతుర్వేది తదితరులున్నారు.

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం: సీఎం


పెట్టుబడులకు, కంపెనీల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వాతావరణం, పరిస్థితులు అన్ని రకాల వ్యాపారాలకు, పెట్టుబడులకు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం అత్యంత పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉందని వివరించారు. మంచి పారిశ్రామిక పాలసీని తీసుకువచ్చామని, మీరు కూడా పెట్టుబడులు పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని రిజ్వానిని సీఎం కేసీఆర్ కోరారు.kcr

No comments:

Post a Comment