Friday 30 October 2015

ఆలోచనలకు ఆవిష్కరణల రూపం

 మైక్రోసాఫ్ట్, గూగుల్, వాట్సాప్..టెక్నాలజీ ప్రియులకే కాదు సామాన్యుడి జీవితంలోనూ భాగస్వామ్యమై పోయిన అత్యంత పాపులర్ ఆవిష్కరణలు. ప్రపంచం మొత్తం మీద ప్రభావాన్ని చూపిస్తున్న ఈ ఆవిష్కరణలన్నీ ఏదో మారుమూల ప్రాంతంలో అతిచిన్న ఆలోచనలుగానే ప్రారంభమైనవే. ఆయా దేశాల్లో వాతావరణం అనుకూలించి మహా ఆవిష్కరణలుగా మారాయి. ఇలాంటి ఆలోచనలు మన దగ్గరా ఉంటాయి. అయితే అవి రూపుదాల్చే వనరులు, వసతులు లేవు. అలా అంకురించే అనేక ఆలోచనలు మొగ్గలోనే మాయమవకుండా వాటికి సహకరించి, అవి ఆవిష్కరణ రూపం దాల్చి.. మార్కెట్‌లో సత్తా చాటే స్థాయి దాకా చేరవేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ సిద్ధం చేసింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, బెంగళూరులోని స్టార్టప్‌ల కేంద్రాన్ని మించేలా గచ్చిబౌలిలో ఐదు అంతస్తుల్లో టీ హబ్ భవనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి కే తారకరామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏడాదిపాటు శ్రమించి సిద్ధం చేసిన ఈ టీహబ్ నవంబర్ ఐదున ప్రారం భం కానుంది. ఈ నేపథ్యంలో టీ హబ్ విశిష్టతల గురించి మంత్రి కేటీఆర్‌తో నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.....

t-hub


ప్రశ్న: టీహబ్ ఎందుకు?


మంత్రి కేటీఆర్: తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే వారు భారీ సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారికి ఆర్థిక తోడ్పాటు అందించే వారు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ రెండు వర్గాలను సమన్వయం చేయడమే టీ-హబ్ ప్రధాన ఉద్దేశం. దీనికి వేదిక టీహబ్ భవనం. హైదరాబాద్ ఐఐఐటీలో 70వేల చదరపు అడుగులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ భవనం నిర్మించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ ఔత్సాహికులు, వారిని పోత్సహించే పారిశ్రామికవేత్తలైన వెంచర్ క్యాపిటలిస్టులు-ఏంజిల్ ఇన్వెస్టర్లను హైదరాబాద్‌కు ఆకర్షించడం ప్రభుత్వ ఉద్దేశం. 

స్టార్టప్‌లకు ఎలాంటి సహకారం అందుతుంది?


విస్త్రృత స్థాయిలో నెట్‌వర్క్‌లను కొనసాగిస్తూ కొత్త ఆవిష్కరణలను తెరమీదకు తేవడం స్టార్టప్‌లకు మేం అందించే ముఖ్య సహకారం. ఈ క్రమంలో స్టార్టప్‌లను, పెట్టుబడిదారులను, రీసెర్చ్ సెంటర్‌లను విస్త్రృతంగా అందుబాటులోకి తేవడం మా ఉద్దేశం. ఈ కేంద్రంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ), ఐఐఐటీ, నల్సార్‌ల భాగస్వామ్యం ఉంది. బిజినెస్ ప్లాన్ ఎలా రాయాలి? స్టార్టప్‌లను వ్యాపారపరంగా ఏవిధంగా ముందుకుతీసుకువెళ్లాలి? ఈ క్రమంలో పాటించాల్సిన విధివిధానాలేమిటి అనే విషయంలో ఐఎస్‌బీ మెంటార్లు సూచనలిస్తారు. స్టార్టప్‌లు పరిగణనలోకి తీసుకోవాల్సిన సాంకేతిక అంశాలపై ఐఐఐటీ మెంటార్లు, పేటెంట్లు, ఇంటలెక్చువల్ రైట్స్, లీగల్ అంశాల్లో నల్సార్ నిపుణులు మార్గదర్శనం చేస్తారు. 

ఈ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కల్పించిన సదుపాయాలేంటి?


టీహబ్ విజయవంతమయ్యేందుకు సీఈవో సహా సీఓఓలను నియమించాం. నాస్కాం, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో పాటు దిగ్గజ వ్యాపారవేత్తలతో కూడిన ఒక బోర్డును సిద్ధం చేశాం. ప్రభుత్వం తరఫున రూ.10 కోట్ల మూలనిధి సమకూర్చాం. ఈ నిధిని 100 బిలియన్ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పూర్తి వసతుల కల్పించి నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వనున్నాం. 

సరే.. దీనివల్ల రాష్ర్టానికి కలిగే ప్రయోజనం?


ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఒకరకంగా చూస్తే టీ హబ్ ద్వారా ప్రభుత్వానికి నేరుగా దక్కే ప్రయోజనం లేదుగానీ... ఇప్పటికే ఐటీ రంగంలో పేరెన్నికగన్న హైదరాబాద్ స్టార్టప్‌ల రంగంలోనూ ఐకాన్‌గా మారుతుంది. అది మనకు గర్వకారణం. ఇక ఇక్కడి ఆవిష్కర్తలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. తద్వారా తెలంగాణ బిడ్డలకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయి కదా! 

టీ హబ్‌లో స్టార్టప్ భాగస్వామ్యం పంచుకోవాలనుకునేవారు ఎలా సంప్రదించాలి?


టీ హబ్ వెబ్‌సైట్ ఉంది. దాని ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా కార్యాలయానికి నేరుగా వచ్చి ఆసక్తిని తెలియజేయవచ్చు. వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బృందం అర్హులను ఎంపిక చేస్తుంది. అత్యుత్తమ ఆలోచన కలిగి ఉండి, వ్యాపారపరంగా విజయవంతమయ్యే అవకాశం ఉంటే..విద్యార్హతతో సంబంధం లేకుండానే స్టార్టప్‌లకు చోటు కల్పిస్తారు. వారి వారి అవసరాలకు తగినట్లు క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ ఇస్తారు. దీనికి టీ హబ్ నిర్దేశించిన చార్జీలుంటాయి. స్టార్టప్‌లు టీ హబ్‌లో తమ కార్యకలాపాలకు కేటాయించిన సమయం వృథా పోకుండా ఐఎస్‌బీ ద్వారా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అందజేయనున్నాం.

ఏ రంగంలోని స్టార్టప్‌లను ప్రోత్సహిస్తారు?


హైదరాబాద్ ఇప్పటికే ఐటీ రంగంలో పేరెన్నికగన్నది. సహజంగానే ఐటీకి చెందిన స్టార్టప్‌లే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. హెల్త్‌కేర్ విభాగంలోని సంస్థలు, వ్యాపారవేత్తలు సైతం వస్తున్నారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు బీవీ మోహన్‌రెడ్డి , సీపీ గుర్ణాని, శశీరెడ్డి, కిట్టూ కొల్లూరి, కీర్తి మెల్కొటే, రాజు రెడ్డి వంటి వారు ఇందులో భాగస్వాములు కానున్నారు. 

ఐటీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు?


తెలంగాణలో ఐటీ వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 10 బిలియన్ డాలర్లు ఉన్న ఎగుమతుల సామర్థ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఐటీ, ఐటీఈఎస్ రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. టీహబ్ రెండో ఫేజ్‌ను రాయదుర్గంలో విస్తరిస్తాం. గేమ్‌సిటీ సమీపంలోని 15 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఏర్పాటవుతుంది. 3లక్షల ఎస్‌ఎఫ్‌టీల్లో ప్రస్తుత భవనానికి నాలుగున్నర రెట్లు ఫేజ్2 ఉంటుంది. 
నవంబర్ 5న ప్రారంభోత్సవం అంటున్నారు. ఆ విశేషాలు..
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, విఖ్యాత పారిశ్రామికవేత్త రతన్‌టాటాలు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. వీరితోపాటు పారిశ్రామికవేత్తలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు ఇలా చాలామంది వస్తున్నారు.

టీ హబ్‌పై ప్రచారానికి మీ వ్యూహమేమిటి?


హైదరాబాద్‌కు వచ్చిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులందరినీ టీ హబ్ కార్యాలయం సందర్శించాల్సిందిగా కోరుతాం. ఒకసారి వస్తే వారికే ఈ హబ్ విశిష్టత తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి ఇటీవల దీన్ని సందర్శించి అభినందించారు. తమిళనాడు ప్రభుత్వ ముఖ్య 

ktrinterw


కార్యదర్శి కూడా టీ హబ్‌ను మెచ్చుకున్నారు. అడోబ్ సీఈవో శంతను నారాయణ్ టీహబ్‌ను సందర్శించి మైమరచిపోయారు. తాను, మైక్రోసాఫ్ట్ సీఈవో ఉన్న ఫొటోను సెల్ఫీ తీసుకొని సత్య నాదెళ్లకు పంపిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇంకోవైపు సిలికాన్ వ్యాలీలోనూ ఫ్రాంచైజీ ఏర్పాటుచేయనున్నాం. సోషల్ మీడియా ఉంది. ప్రచారం కల్పిస్తాం. స్టార్టప్ ఫెస్ట్ నిర్వహించనున్నాం.

No comments:

Post a Comment